శ్రీతేజ్‌ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..!

శ్రీతేజ్‌ గాయాలపాలై సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం. శ్రీతేజ్‌కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.

మమ్మల్ని గుర్తు పట్టడంలేదు.. శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌

”శ్రీతేజ్‌ ఐదు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 15 రోజుల నుంచి ఐసీయూ నుంచి రూమ్‌కి షిఫ్ట్‌ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇన్ఫెక్షన్లు లేకుండా నిలకడగా ఉంది. వైద్యులు రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించాలని సూచించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తున్నాడు. ద్రవరూపంలో ఉన్న ఆహారం మాత్రమే పంపిస్తున్నాం. బ్రెయిన్‌ అయితే ఇంకా రికవరీ కాలేదు. మమ్మల్ని గుర్తు పట్టడంలేదు. ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని.. రిహాబిలిటేషన్‌కు తీసుకెళ్తే కొంత మెరుగుపడొచ్చని వైద్యులు సూచించారు. ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

పుష్ప- 2 చిత్రం యాజమాన్యం, సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వం నుంచి మాకు బాగా మద్దతు లభించింది. బాబు ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నుంచే మాకు సపోర్టు అందింది. ఇప్పటికీ మమ్మల్ని వైద్యులు, కిమ్స్‌ యాజమాన్యం డబ్బులు అడగలేదు. డిశ్చార్జి సమయంలో ఏమీ బలవంతం చేయలేదు. శ్రీతేజ్‌ చెల్లెలు అమ్మ ఏది? అని అడుగుతోంది. ఊరెళ్లిందని చెబుతున్నాం. బాబుని చూసేందుకు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు.. తను మాట్లాడుతున్నా శ్రీతేజ్‌ స్పందించడం లేదు. మాకు సపోర్టు చేసిన అందరికీ కృతజ్ఞతలు” అన్నారు.

హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన కిమ్స్‌ వైద్యులు

మరోవైపు, శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్‌ కిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇవాళ శ్రీతేజ్‌ను డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. ”బాలుడిని న్యూరో రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించాం. శ్రీతేజ్‌కు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహాయం అవసరంలేదు. నోటి ద్వారా ఆహారం తీసుకొంటున్నాడు” అని పేర్కొన్నారు.