మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌..పాక్‌లో ప్రభుత్వ భద్రత..!

లష్కరే తోయిబా చీఫ్‌, భారత మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ (Hafiz Saeed) అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ హఫీజ్‌కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అతడు పాక్‌లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ ఆంగ్ల మీడియా తమ కథనంలో వెల్లడించింది.

ప్రైవేటు పార్క్‌, బంకర్‌..

సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని.. అక్కడినుంచే తమ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తుంటారు. కానీ, హఫీజ్‌ సయీద్‌ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు లాహోర్‌లోని జోరమ్‌ తౌమ్‌ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్యపౌరులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. హఫీజ్‌ నివాసం వద్ద పాక్‌ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో హఫీజ్‌ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారట. ఇంటిముందు ఓ ప్రైవేటు పార్క్‌, పక్కనే మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు సమాచారం. భవనం కింద ఓ బంకర్‌ కూడా ఉందని సదరు కథనం పేర్కొంది.

జైల్లో ఉన్నాడంటూ పాక్‌ బుకాయింపులు

హఫీజ్‌ సయీద్‌ పాక్‌లో బహిరంగంగా తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చి కేసులో అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తోంది. 2019లో హఫీజ్‌ అరెస్టయినట్లు కథనాలు వచ్చాయి. ఆ మధ్య హఫీజ్‌ అనుచరులు, లష్కరే ఉగ్రవాదుల వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాలతో అతడికి పాకిస్థాన్‌ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటినే సబ్‌జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి.

2008 నవంబరు 26న దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్ర దాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది..