వేసవిలో తప్పక తాగాల్సిన “సత్తు మజ్జిగ” – ఒక్క గ్లాసు తాగారంటే చాలు…!

వేసవిలో తప్పక తాగాల్సిన “సత్తు మజ్జిగ” – ఒక్క గ్లాసు తాగారంటే డీహైడ్రేషన్, నీరసం దరిచేరవు!

తాజాగా మీకోసం ఒక సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ రెసిపీని తీసుకొచ్చాం. మజ్జిగతో కలిపి ప్రిపేర్ చేసుకునే ఈ డ్రింక్ వేసవిలో దివ్యౌషధంలా పనిచేస్తుంది. అదే, “సత్తు బటర్ మిల్క్”. మండుటెండల్లో మధ్యాహ్నం వేళ దీన్ని ఒక్క గ్లాసు తాగారంటే చాలు. శరీరానికి చల్లదనంతో పాటు మంచి ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రొటీన్ రిచ్ పానీయం కూడా. దీన్ని పెద్దలే కాదు పిల్లలూ ఎంతో ఇష్టంగా తాగుతారు. పైగా ఈ డ్రింక్ని ఎవరైనా చాలా సింపుల్గా, తక్కువ టైమ్లో రెడీ చేసుకోవచ్చు.

టిప్స్ :

ఇక్కడ వేయించిన శనగల పిండినే(చిక్పీస్ ఫ్లోర్) సత్తు పౌడర్ గా పిలుస్తారు.ఇది బయట అన్ని సూపర్ మార్కెట్స్ లో లభిస్తుంది.

ఇంట్లో చేసుకోవడం కూడా ఈజీనే మనకు బయట మార్కెట్లో వేయించిన శనగలు దొరుకుతాయి కదా వాటిని వాటి పొట్టు తో సహా మిక్సీ పట్టుకుంటే సత్తు పిండి వస్తుంది.

మజ్జిగను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ డ్రింక్ కి బటర్ మిల్క్ మంచి టేస్ట్ ఇస్తుంది.

తీసుకోవాల్సిన పదార్థాలు :

సత్తు పిండి – 4 టేబుల్ స్పూన్లు
బెటర్ మిల్క్ – ఒక గ్లాసు
ఉప్పు – రుచికి తగినంత
బ్లాక్ సాల్ట్ – ఒక టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
చాట్ మసాలా – ఒక టీస్పూన్
సన్నని ఉల్లిపాయ తరుగు – కొద్దిగా
పచ్చిమిర్చి – 1
కొత్తిమీర తరుగు – కొద్దిగా.

సింపుల్ గా ప్రిపేర్ చేసుకోండిలా :

ఈ సమ్మర్ హెల్దీ డ్రింక్ కోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ మిల్క్ తీసుకోవాలి. ఆపై అందులో సత్తుపిండిని వేసి రెండూ చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తర్వాత అందులో జీలకర్ర పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఉప్పు వేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి.

అనంతరం ఆ మజ్జిగ మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి మరోసారి బాగా కలపాలి ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలు.

అంతే, టేస్టీ అండ్ ఎనర్జిటిక్ “సత్తు బటర్ మిల్క్ డ్రింక్” మీ ముందు ఉంటుంది!

ఆరోగ్య ప్రయోజనాలు :

ఈ డ్రింక్ తయారీకి వాడిన సత్తుపిండిలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్తో పాటు శరీరానికి కావాల్సిన మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, మజ్జిగలో ప్రోబయోటిక్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయికగా ఏర్పడిన సత్తు బటర్ మిల్క్ పానీయం ముఖ్యంగా బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. శరీరానికి మంచి రక్షణ, శక్తిని అందిస్తుందంటున్నారు నిపుణులు.