ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..!

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని చేపట్టాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడింది భారత సైన్యం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్ లోని ఉగ్రమౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు భారత్ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా..పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది..

భారత్, దాయాది దేశం పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పీవోకే లో భారత్ బాంబుల మోత షురూ చూసింది. ముజఫరాబాద్ కొండల సమీపంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు అక్కడి స్థానికులు వెల్లడించారు. స్థానిక గ్రిడ్ స్టేషన్ పై మిస్సైల్ అటాక్ జరిగిందని.. దీంతో ప్రాంతమంతా కరెంట్ పోయిందని వారు చెప్పారు. దీంతో ముజఫరాబద్, కోట్లి ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది…ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే పాక్ లోని ఉగ్రవాదులు, పీవోకేలోని లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మి మెరుపులు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఆర్మీ మిస్సైల్స్ తో విరుచుకపడుతోంది. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనే పోస్టుతో జస్టిస్ ఈజ్ సర్వ్ డ్ జై హింద్ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. వార్…ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని.. పాక్ ఆర్మీపై దాడులు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. లక్ష్యాల ఎంపిక, అమలులో ఆర్మీ అత్యంత సంయమనం పాటించిందని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం దాడులకు సంబంధించిన పూర్తి వివరాలన వెల్లడిస్తామని పేర్కొంది.
అయితే, పాక్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తోంది. తాజాగా కశ్మీర్ లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే పాక్ ఆర్మీకి ధీటు సమాధానం ఇచ్చినట్టు భారత్ ఆర్మీ వెల్లడించింది.