పాక్ యుద్ధంపై భారత్ కీలక ప్రకటన.
_• భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్ట్రీ కీలక ప్రకటన చేశారు._
_• రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, సా. 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందని వెల్లడించారు._
_• అటు ఈ నెల 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు..
భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ‘ట్రూత్‌సోషల్’ వేదికగా ప్రకటించారు. ఇరు దేశాలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావించారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్థాన్ ఒక అవగాహనకు వచ్చాయని ఎస్ జైశంకర్ తెలిపారు. అలాగే ఉగ్రవాదంపై వైఖరికి భారత్ రాజీపడబోదని అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విమరణ, సైనిక చర్యపై ఒక అవగాహన కుదుర్చుకున్నాయి. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన, రాజీలేని వైఖరిని భారత్ నిరంతరం కొనసాగిస్తుంది. ఇది అలాగే కొనసాగుతుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విజ్ఞత పాటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత తక్షణ, సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పారు. ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కొన్ని సేపటికే భారత్ కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.
పహల్గాంలో గత నెల 22న ఉగ్రవాదులు టూరిస్టులను మతం పేరు అడిగి మరీ కాల్చిచంపడంతో పాకిస్థాన్ భూభాగంపై భారత్ దాడులు జరిపింది. దీంతో పాకిస్థాన్ కూడా భారత భూభాగాలపై దాడులు యత్నించింది. భారత్ దీటుగా సమాధానం చెప్పింది.
పాకిస్థాన్ ప్రకటన
పాకిస్థాన్, ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. తమ దేశం ఎల్లప్పుడూ శాంతి, భద్రతలనే కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీపడకుండానే శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఉగ్ర చర్యలకు పాల్పడితే యుద్ధ చర్యకు పాల్పడ్డట్టే.
పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్‌పై యుద్ధ చర్యకు పాల్పడ్డట్టుగానే పరిగణించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తారు. అందుకు తగ్గట్టుగానే భారత్ ప్రతిస్పందన ఉంటుంది..
గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చిచంపడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని తేలడంతో భారత్ రగిలిపోయింది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్స్ స్ట్రైక్స్ చేస్తోంది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది..