ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి, జట్టుకు ఒక్కసారైనా ట్రోఫీ అందించాలనేది చిరకాల స్వప్నం. ఎన్నోసార్లు ప్లేఆఫ్స్కు చేరినా, ఫైనల్స్లో అడుగుపెట్టినా విజయం మాత్రం ఆర్సిబికి దూరంగానే ఉండిపోయింది. ఈ క్రమంలో తొలిసారి ట్రోఫీ దక్కడంతో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొట్టమొదటిసారిగా టైటిల్ను కైవసం చేసుకున్న క్షణం, ఆ జట్టు మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సార్లు అందని ద్రాక్షగా ఊరించిన ట్రోఫీ ఎట్టకేలకు సొంతమవడంతో, కోహ్లీ మైదానంలోనే ఆనందభాష్పాలు రాల్చాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను ద్రవింపజేసింది..
విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “కింగ్ కన్నీళ్లు ఇవి, ఆనందభాష్పాలు ఇవి”, “ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది”, “ఈ క్షణం కోసమే కదా ఎదురుచూసింది” అంటూ అభిమానులు తమ సంతోషాన్ని, కోహ్లీ పట్ల తమకున్న అభిమానాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తపరిచారు. కఠినంగా, దూకుడుగా కనిపించే కోహ్లీలోని సున్నితమైన కోణాన్ని ఈ వీడియో ఆవిష్కరించిందని పలువురు వ్యాఖ్యానించారు..