కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ
తెలంగాణ భవన్ వేదికగా ప్రెజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించిన బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు..
ఆధారాలు, డాక్యుమెంట్లు చూపెట్టి కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారం శుద్ధ తప్పు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు వంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతామన్నారు. “మేం భయపడ్తున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు?.. కమిషన్ ముందు హాజరై వాస్తవాలను ఉంచుతాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం” అని అన్నారు.
దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్ రావు అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. 2009 ఎన్నికల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాలో కొబ్బరికాయలు కొట్టి.. నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారని.. నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం పక్కన పెడితే ఎనిమిది ఏండ్లు అయినా ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదని హరీష్ రావు విమర్శించారు…..ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించామని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకోసమే పనిచేయాలని అధినేత కేసీఆర్ మాకు ఎప్పుడు చెబుతుంటారని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార. కేవలం రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు….కాళేశ్వరం అంటే ఏమిటి..?
పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాళేశ్వరం అంటే.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం అని హరీశ్ రావు చెప్పారు.
మొత్తం కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు ఉన్నాయని. వాటిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్, సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్, అన్నారం బ్యారేజీలో 64 పియర్స్ ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిలో మేడిగడ్డ బ్యారేజ్ లోని కేవలం రెండు పియర్స్ మాత్రమే కుంగాయని, అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. మొత్తం కాళేశ్వరమే కుప్పకూలిందని దుష్ప్రచారం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. మేడిగడ్డలో ఏడు బ్లాక్ లు ఉన్నాయి.. ఒక్కో బ్లాక్ లో కొన్ని పియర్స్ ఉన్నాయి. మొత్తంగా 85 పియర్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే మొత్తం బ్యారేజీ ఇంపాక్ట్ అవుతుంది.. కేవలం రెండు పియర్స్ వల్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని హరీశ్ రావు అన్నారు..
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.