సింగర్ మంగ్లీకి షాక్.. కేసు నమోదు
TG: మంగ్లీకి చేవెళ్ల పోలీసులు షాక్ ఇచ్చారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినందుకు మంగ్లీతోపాటు పార్టీకి హాజరైన పలువురిపై కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ ఇచ్చారు మంగ్లీ. ఆ రిసార్ట్పె రైడ్ చేసిన పోలీసులు భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. పార్టీకి వచ్చిన వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. పలువురికి గంజాయి పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది…
జూన్ 10 రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ తన బర్త్ డేను (birthday celebrations) స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పార్టీలో అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేయడంతో పాటు గంజాయి వినియోగించినట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానిక పోలీసులతో కలిసి ఎక్సైజ్ పోలీసులు రిసార్ట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భారీ మొత్తంలో విదేశీ మద్యం, గంజాయి పట్టుబడ్డాయి. అదే సమయంలో డీజే సౌండ్ సిస్టమ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీలో పాల్గొన్న వారిలో దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అతనితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పలువురికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలింది. ఈ ఘటనతో రిసార్ట్ లో జరిగిన పార్టీ అక్రమంగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేసినందుకు మంగ్లీ, రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదైంది..
మంగ్లీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ఫోక్ సింగర్‌గా గుర్తింపు పొందింది. ఆమె గాయనిగా, నటిగా పలు సినిమాల్లో రాణించింది. టీటీడీ ఎస్వీబీసీ చానల్ మెంబర్ గా పని చేసినట్లు సమాచారం. అలాంటి వ్యక్తి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు మంగ్లీని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నారు. రిసార్ట్ లో గంజాయి సరఫరా ఎవరు చేశారు, విదేశీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మంగ్లీ లేదా ఆమె టీం నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.