భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు శనివారం ఆసక్తికరంగా మారింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా రెండో రోజు ఇంగ్లాండ్ పుంజుకుంది…
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేయగా…అదే స్థాయిలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విజృంభించినా…అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ప్రస్తుతానికి ఇరు జట్లు సమాన స్థితిలోనే ఉన్నా… మూడో రోజు తొలి సెషన్లో బుమ్రాను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది!
లీడ్స్: బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్లతో రెచి్చపోవడంతో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బుమ్రా మినహా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో… శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) ‘శత’క్కొట్టగా… బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్… టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. పోప్‌తో పాటు బ్రూక్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (227 బంతుల్లో 147; 19 ఫోర్లు, 1 సిక్స్) టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసుకోగా… రిషభ్ పంత్ (178 బంతుల్లో 134; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
బుమ్రా ఒంటరి పోరాటం…
సిరీస్ ఆరంభానికి ముందు అంతా ఊహించినట్లు… ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని నిరూపించుకున్నాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కాగా… తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ (4)ని పంత్ వెనక్కి పంపాడు. అదే తీవ్రత కొనసాగిస్తూ బుమ్రా రెచ్చిపోతుంటే… ఇంగ్లండ్ బ్యాటర్లు ప్రతీ బంతికీ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీశారు.
ఈ క్రమంలో ఎడ్జ్ల ద్వారా కాస్త పరుగులు రాగా… మనవాళ్ల పేలవ ఫీల్డింగ్ ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్ వంటి పేస్ పిచ్‌లపై స్లిప్స్‌లో దూసుకొచ్చే బంతులను అందుకోవడంలో యువ ఆటగాళ్ల అనుభవ రాహిత్యం కొట్టిచి్చనట్లు కనిపించింది. బుమ్రా బౌలింగ్‌లోకు ఫీల్డర్ల మద్దతు లభించి ఉంటే ఈ పాటికి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చి ఉండేదే! కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న బెన్ డకెట్, పోప్ కుదురుకున్నాక చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు.
బుమ్రా బౌలింగ్‌ను కాచుకున్న ఈ జంట… సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్వేచ్ఛగా ఆడింది. దీంతో ఏ దశలోనూ పరుగుల వేగం తగ్గలేదు. టీ విరామం అనంతరం మరోసారి బంతినందుకున్న బుమ్రా… డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా… చివరి సెషన్లో పోప్ చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ… 125 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రూట్ (28)ను బుమ్రా బుట్టలో వేసుకోగా… ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది.
అదరగొట్టిన పంత్..
తొలి రోజు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న భారత బ్యాటర్లు… రెండో రోజు తొలి సెషన్ ఆరంభంలోని దాన్ని కొనసాగించారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు గిల్, పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్ కాస్త సంయమనం పాటించగా… పంత్ మాత్రం భారీ షాట్లతో రెచి్చపోయాడు. ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో మూడంకెల స్కోరు అందుకున్నాడు.
అనంతరం తనదైన శైలిలో పల్టీలు కొడుతూ సంబరాలు జరుపుకున్నాడు. గతేడాది బంగ్లాదేశ్‌పై సెంచరీ అనంతరం పంత్‌కు ఇదే తొలి మూడంకెల స్కోరు. వన్డే తరహాలో ఆడిన ఈ జోడీ చకచకా పరుగులు రాబట్టింది. నాలుగో వికెట్‌కు 301 బంతుల్లో 209 పరుగులు జోడించిన అనంతరం గిల్ అవుటయ్యాడు. షోయబ్ బషీర్ బంతికి క్రీజు వదిల బయటకు వచ్చి భారీ షాట్‌కు యతి్నంచిన గిల్… బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో టంగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 430 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అదే సమయంలో వాతావరణంలో స్వల్ప మార్పులతో మేఘావృతం కాగా… ఇంగ్లండ్ పేసర్లు రెచి్చపోయారు.
ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎక్స్ట్రా కవర్స్‌లో పోప్ పట్టిన మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లో పంత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా… పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (1) అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 454/7తో లంచ్‌కు వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత మరో 17 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (11) ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్ కావడం దెబ్బకొట్టింది. ఓవరాల్‌గా టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (సి) టంగ్ (బి) బషీర్ 147; పంత్ (ఎల్బీ) (బి) టంగ్ 134; కరుణ్ నాయర్ (సి) పోప్ (బి) స్టోక్స్ 0; జడేజా (బి) టంగ్ 11; శార్దుల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 1; బుమ్రా (సి) బ్రూక్ (బి) టంగ్ 0; సిరాజ్ (నాటౌట్) 3; ప్రసిధ్ కృష్ణ (బి) టంగ్ 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (113 ఓవర్లలో ఆలౌట్) 471.
వికెట్ల పతనం: 1-91, 2-92, 3-221, 4-430, 5-447, 6-453, 7-454, 8-458, 9-469, 10-471.
బౌలింగ్:వోక్స్ 24-4-103-0; కార్స్ 22-5-96-1; టంగ్ 20-0-86-4; స్టోక్స్ 20-2-66-4; బషీర్ 27-6-100-1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (బ్యాటింగ్) 100; రూట్ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 209.
వికెట్ల పతనం: 1-4, 2-126, 3-206.
బౌలింగ్: బుమ్రా 13-2-48-3; సిరాజ్ 14-0-50-0; ప్రసిధ్ కృష్ణ 10-0-56-0; జడేజా 9-2-25-0; శార్దుల్ 3-0-23-0.
ఆ మూడు క్యాచ్‌లు పట్టుంటే… బుమ్రా బౌలింగ్‌లో డకెట్ రెండు సార్లు బతికిపోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచి్చన క్యాచ్‌ను గల్లీలో యశస్వి జారవిడవగా… భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు. డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచి్చన క్యాచ్‌ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు..
పోప్ సెంచరీ.. దీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇంగ్లాండ్ దీటుగా బదులిస్తోంది. బుమ్రా తొలి ఓవర్లోనే జాక్ క్రాలీ(4)ను అవుట్ చేయడంతో మొదట ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. కానీ, క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ అజేయ శతకంతో రెచ్చిపోయాడు. వన్డే తరహాలో ఆడుతూ బౌండరీలతో చెలరేగాడు. అతనికితోడు బెన్ డక్కెట్ కూడా సత్తాచాటాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లాండ్ గాడిలో పడింది. డక్కెట్‌ను బుమ్రా అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం జో రూట్(28)తో కలిసి ఓలీ పోప్ స్కోరును 200 దాటించాడు. అయితే, బుమ్రా ఇంగ్లాండ్‌ను ఇబ్బందిపెట్టాడు. జాక్ క్రాలీ, డక్కెట్, జోరూట్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు..