ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా సబ్బుల పెట్టెలు ఎత్తుకెళ్లిన జనం..మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు.!.!

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల గ్రామ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి..ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్‌ మృతి చెందాడు. దేవాపూర్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్‌ లారీ, హైదరాబాద్‌ నుంచి సంతూర్‌ సబ్బుల లోడ్‌తో ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్న లారీఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాసిపేట మండలం పలాంగూడ గ్రామానికి చెందిన ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ (52) క్యాబిన్‌లో ఇరుక్కుని మృతిచెందాడు.

పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో లారీ డ్రైవర్‌ సచిన్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సంతూర్‌ సబ్బుల లారీ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలియడంతో సమీపంలోని ప్రజలు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని లారీపైకి ఎక్కి ఇష్టారాజ్యంగా సబ్బులు ఎత్తుకెళ్లారు. సబ్బులను సంచుల్లో నింపుకొని కొందరు వెళ్లగా, మరికొందరు పెట్టెలను ఎత్తుకుని వెళ్లారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్లు ఒకవైపు నెత్తురోడుతూ ఉండగా వారిని రక్షించకుండా స్థానికులు సబ్బులకోసం ఎగబడ్డారు. గురువారం ఉదయం కూడా పలువురు సబ్బులను తీసుకెళ్లడం కనిపించింది..