కోల్కతాలో ఈ నెల 25న రాత్రి ఓ లా కాలేజ్ విద్యార్థిని(24)పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో మొదట ముగ్గురు నిందితుల (పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్లు)ను అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును సైతం అదుపులోకి తీసుకున్నారు..ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాకు పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. విద్యార్థినిని సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని వేడుకుంటూ ఆ యువతి మోనోజిత్ కాళ్లను పట్టుకున్నా వదలలేదు..ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా హాకీ స్టిక్తో ఆమెపై దాడి చేశారు. మోనోజిత్ న్యాయవాదిగా పనిచేస్తూ, ఇదే కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగానూ ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అయితే, తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని మోనోజిత్ కు ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఆమె దేహంపై పలుచోట్ల పంటిగాట్లతో పాటు గాయాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మెడ, ఛాతీపై పంటి గాట్లతో పాటు శరీరంపై నిందితులు గోళ్లతో గీరిన గాయాలు ఉన్నాయి. వివాహం చేసుకోనని ఆమె చెప్పడంతోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు…