ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల కింద అమెరికాపై ప్రతీకార సుంకాలను భారత్ ప్రతిపాదించింది..భద్రతా చర్యల పేరిట వాహన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్లు డబ్ల్యూటీఓ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని మనదేశం పేర్కొంది. అందువల్ల అమెరికాకు మినహాయింపులు, ఇతరత్రా చర్యలను రద్దు చేయాలని కోరుతూ డబ్ల్యూటీఓకు చెందిన కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్ను భారత్ కోరింది.
ఇదీ జరిగింది: భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రయాణికుల వాహనాలు, తేలిక పాటి ట్రక్కులు, వాహన విడిభాగాలపై సుంకాన్ని 25% పెంచుతున్నట్లు అమెరికా ఈ ఏడాది మార్చి 26న ప్రకటించింది. మే 2 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అపరిమిత గడువుకు వర్తించేలా తీసుకున్న ఈ అంశాన్ని డబ్ల్యూటీఓకు అమెరికా నివేదించలేదు.
గాట్-1994నూ పాటించట్లేదు: జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ (గాట్) 1994, సేఫ్గార్డ్స్ అగ్రిమెంట్ కింద అమెరికా చర్యలు సరైనవి కావని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత విజ్ఞప్తి మేరకు ‘మినహాయింపులను ఇతర ప్రోత్సాహకాలను రద్దు చేసేందుకు భారత్కు హక్కు ఉందంటూ’ డబ్ల్యూటీఓ నోటిఫికేషన్ వెలువరచింది. దీంతో అమెరికా నుంచి భారత్కు దిగుమతి అయ్యే వస్తువులపై అంతే సుంకాన్ని విధించాలని భారత్ ప్రతిపాదించిందనీ తెలిపింది. మరోవైపు, ఉక్కు, అల్యూమినియంపై అమెరికా టారిఫ్లకు స్పందనగా ప్రతీకార సుంకాలను విధించే హక్కు తమకుందని డబ్ల్యూటీఓకు భారత్ సమాచారం అందించింది.
అమెరికా సుంకాలు ఇలా
ఏటా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే 2,895 మిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనపు సుంకం పడుతోంది. ఇందువల్ల వసూలు చేయబోయే మొత్తం 723.75 మి. డాలర్లు కావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా గతేడాది 89 బి. డాలర్ల విలువైన వాహన విడిభాగాలను దిగుమతి చేసుకుంది. ఇందులో మెక్సికో(36 బి.డా.), చైనా(10.1 బి.డా.)లతో పోలిస్తే భారత వాటా(2.2 బి.డా.) చాలా తక్కువ.
9లోగా వాణిజ్య ఒప్పందం
దిల్లీ: అమెరికా-భారత్ మధ్య ఈనెల 9లోగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. వాణిజ్య చర్చల నిమిత్తం అమెరికా వెళ్లిన భారత బృందం తిరిగివచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులు, వాహన రంగాలతో పాటు మరికొన్ని అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగనున్నాయని ఒక అధికారి పేర్కొన్నారు. తమ వ్యవసాయ దిగుబడులపై సుంకాల తగ్గింపులను అమెరికా కోరుతోంది. అందుకు ఆమోదిస్తే, మనదేశంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నిత అంశమైనందున, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపులకు భారత్ ససేమిరా అంటోంది. డెయిరీ రంగాన్ని సైతం ఏ వాణిజ్య భాగస్వామికీ మనదేశం అందుబాటులో ఉంచలేదు..