కృష్ణానదిపై కీలక ప్రాజెక్టు శ్రీశైలం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, కేంద్రం తక్షణమే స్పందించి డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్ మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం రాత్రి శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర అధికారులతో శ్రీశైలం ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించారు. మంత్రి సూచన మేరకు డ్యాం నిర్వహణ పరిస్థితులపై రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
ఏటా కృష్ణా నదికి వస్తున్న భారీ వరదల కారణంగా శ్రీశైలం డ్యాం దిగువన లోతైన గుంత ఏర్పడిందని, ఎన్డీఎస్ఏతో పాటు పలు కమిటీలు దీనిపై అధ్యయనం చేసి డ్యాంకు ముప్పు పొంచి ఉందని ఆయా కమిటీ సభ్యులు హెచ్చరించారని లేఖలో తెలిపారు. మరమ్మతులకు సంబంధించి పలు సిఫార్సులు కూడా చేశాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డుకు, ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ)కు పలుమార్లు లేఖలు రాసిందని వివరించారు..
మంగళవారం ఉదయం 11.50 గంటలకు కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి ఇచ్చి, గేట్లు ఎత్తనున్నారు..
సాధారణంగా ఆగస్టు చివరి నాటికి లేదంటే సెప్టెంబరులో గానీ శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తుతారు. ఈ ఏడాది ఎగువన జూన్ నుంచి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరద ప్రవాహం భారీగా ఉంటోంది. జూన్ 1 నుంచి ప్రారంభమైన నీరు, జులై 5 వరకు శ్రీశైలం జలాశయంలోకి 125 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గత 15 ఏళ్ల సగటు, ఈ కాలవ్యవధికి 12.26 టీఎంసీలే ఉంది. దాంతో ఎప్పుడూ లేనట్లు జులై తొలి వారంలోనే శ్రీశైలం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జులై 30న గేట్లు ఎత్తగా, ప్రస్తుతం దానికి మూడు వారాల ముందే గేట్లు ఎత్తుతుండటం విశేషం. మరోపక్క పోతిరెడ్డిపాడు నుంచి 15 వేల క్యూసెక్కులను వెలుగోడు జలాశయానికి వదులుతున్నారు.
పెరుగుతున్న నీటిమట్టం : శ్రీశైలం జలాశయానికి వరదు కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల, సుంకేశుల జలశయాల నుంచి శ్రీశైలానికి 1,72,795 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.6కు చేరింది. నీటిసామర్థ్యం 218.8 టీఎంసీలు కాగా 196.5గా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వార విద్యుదుత్పత్తి చేసి 67,563 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు..