గత BRS ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం.. సీఎం రేవంత్.

తెలంగాణలో నదుల ప్రవాహం, ఆయకట్టు పరిధి, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. ఇందులో నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపు గురించి ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పు పర్యవసానాలపై కూడా ప్రజెంటేషన్లో వివరిస్తున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికల సారాంశాన్ని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులకు వివరిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ ప్రాజెక్టులు, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఇవాళ కృష్ణా ప్రాజెక్టుల అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రజాభవన్లో జరుగుతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మీడియాకు వివరించారు….కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వివరించారని చెప్పిన సీఎం రేవంత్‌, నివేదికల వాస్తవ పరిస్థితులను కేంద్రం ఎదుట ఉంచామన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది కొట్లాడారని, తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్‌ గుర్తు చేశారు…గత BRS ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో తెలంగాణ నష్టపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్‌ చేయలేదని సీఎం రేవంత్‌ స్పష్టత ఇచ్చారు…కేసీఆర్‌ పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌ చెప్పారు. నీళ్లు, నిధుల శాఖలను కేసీఆర్‌ కుటుంబమే పదేళ్లు నిర్వహించిందని గుర్తు చేసిన సీఎం రేవంత్‌.. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్‌ రేపుతున్నారన్నారు..