వైద్యుల సూచన మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కేసీఆర్కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.
ఈ నెల 3న కూడా ఆయన యశోద ఆసుపత్రిలో చేరగా అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న ఆయన డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆతర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్ఛార్జి సమయంలో వైద్యులు సూచించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు.
అసలేం జరిగింది : షుగర్, సోడియం హెచ్చుతగ్గులతో యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేరిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న కేసీఆర్ను ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. ఈ క్రమంలో వారితో ఆసుపత్రిలో ఇష్టాగోష్ఠిగా గులాబీ అధినేత మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. రైతులకు యూరియా, ఎరువుల లభ్యతతో పాటు వ్యవసాయం, సాగునీరు, ప్రజాసమస్యలపై చర్చించారు. అందుకు సంబంధించిన నేతల నుంచి కేసీఆర్ వివరాలు సేకరించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
జులై 3వ తేదీ సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురై మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పుడు రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్, ఆ తర్వాత ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే బీఆర్ఎస్ నేతలతో ఇష్ఠాగోష్టిని నిర్వహించారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యంపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు..అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అస్వస్థతతో యశోద ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రి వైద్యులు, అధికారులతో సీఎం మాట్లాడారు. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రార్థించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ప్రకటన .
అంతకుముందు కేసీఆర్కు ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై ప్రకటన విడుదల చేశారు. నీరసంతో బాధపడుతూ కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. షుగర్, సోడియం సాధారణ స్థాయికి వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారని చెప్పారు..