బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి..

*నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు*

*మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా*

*తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
https://youtu.be/21NeYYJioPM
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి..గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. రూ. 34. 20 కోట్ల విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారంటూ వ్యంగ్యంగా అన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వ లేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని.. రైతు బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. రేషన్‌ కార్డు అంటే పేద వారి ఆత్మగౌరవం.. గుర్తింపు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్‌ కార్డు అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు.

రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పామని.. ఈ హామీని తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దుష్ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

18 నెలల్లో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రవేశపెట్టి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ. 6, 500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

*మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌*

మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్‌లో సోడా పోయడమే నీకు తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.

సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌లే కాదు.. పోలీస్ స్టేషన్‌ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేతలదంటూ వ్యంగ్యంగా అన్నారు. పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంధించారు. తెలంగాణలో కొత్తగా 3. 58 లక్షల రేషన్‌ కార్డుల పంపిణీ పంపిణి చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్‌ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్‌ కార్డులు అందుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విపులీకరించారు….

*కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి*

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో కార్యక్రమం,సీఎం రేవంత్ రెడ్డితో పాటు హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఉన్నతాధికారులు..

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959