పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలు బిహార్లో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక పునర్విశ్లేషణ ప్రక్రియ (ఎస్ఐఆర్), పహల్గాం ఉగ్రదాడి, భారత్- పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలను లేవనెత్తాయి. కేంద్ర మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సహా పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ సజావుగా సాగడానికి సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
‘ఆ ఆంశాలను ఆఖిలపక్ష సమావేశంలో లేవనెత్తాం’
బిహార్లో ఓటరు జాబితాల సవరణ (ఎస్ఐఆర్) తాలుక పోల్ స్కామ్, భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి వివరణ వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్రమేనని, ఆప్ సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
‘ఆ ఆంశాలపై పార్లమెంట్లో మోదీ ప్రకటన చెయ్యాలి’
పహల్గాం ఉగ్రదాడి, బిహార్లో ఎస్ఐఆర్, భారత్- పాక్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు తదితర అంశాలను అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ లేవనెత్తిందని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్ లేవనెత్తిన కీలక అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన ఇవ్వాలని కోరామన్నారు.
శాంతి భద్రతలను కాపాడడంలో బీజేపీ విఫలం’
ఒడిశాలో శాంతిభద్రతలను కాపాడడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను పరిరక్షణలో ఒడిశా సర్కార్ నిస్సహాయంగా ఉండిపోయిందన్నారు. “ఒడిశాలో బీజేపీ సర్కార్ శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నేరాలు రోజురోజుకూ పెరుగిపోతున్నాయి. బాలేశ్వర్ జిల్లాలో ఇటీవల విద్యార్థిని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితురాలు బీజేపీని ఎంపీ, స్థానిక అధికారులను సంప్రదించింది. ఒడిశా ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మంత్రికి ట్వీట్ చేసింది. అందరూ ఆమెకు వెన్నుపోటు పొడిచారు. ఆమె ఒక స్టూడెంట్, ఏబీవీపీలో చురుకైన సభ్యురాలు. అలాగే పూరీ జిల్లాలో 15 ఏళ్ల బాలికకు దుండగులు నిప్పంటించారు. దాదాపు 20 రోజుల క్రితం భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ను ఐదుగురు కొట్టారు. ఈ ఘటనలను చూస్తే ఒడిశాలో బీజేపీ ఆరాచక, చట్టవిరుద్ధ పాలన నడుస్తుందో తెలుస్తుంది. పూరి రథయాత్ర సమయంలో జరిగిన తొక్కిసలాట, అనేక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతాం” అని సస్మిత్ పాత్రా తెలిపారు…