అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్‌పై చేసిన అణు బెదిరింపులకు ఇండియా దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు పాకిస్థాన్ తన అసలు రంగు చూపిస్తోందని దుయ్యబట్టింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Pakistan Aarmy Chief on India
‘‘అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు చేయడం పాకిస్థాన్‌కు అలవాటే. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలి. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టి స్పష్టం అవుతోంది. అక్కడ సైన్యం, ఉగ్ర ముఠాలతో చేతులు కలిపింది. అమెరికా గడ్డపై మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. అయితే, ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోం’’అన్నారు..అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాయి. ‘‘పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురైనట్లే’’ అని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మునీర్, భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశారు. సింధూ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తామని, ఆ తర్వాత వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తామని అన్నారు.
కాగా మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదన చేశారు. అనంతరం తాజాగా భారత్‌పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.