హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 ఆగస్టు (బుధవారం) నుంచి 15 ఆగస్టు (శుక్రవారం) వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ ప్రకటన విడుదల చేశారు..ఉత్తర హైదరాబాద్, మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో 10-15 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉండగా.. కొన్ని చోట్ల 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరం కాకపోతే వాహనాలతో బయటకు రాకూడదని హైడ్రా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచన చేసింది. ముంపు ప్రాంతాల్లో అనవసరంగా తిరగకూడదు. హైడ్రా, జీహెచ్ఎంసీ రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సహాయం కోసం.. 040 29560521, 9000113667, 9154170992 నంబర్లను సంప్రదించవచ్చు. ఇక బుధవారం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని.. హైడ్రా కమిషనర్ ప్రభుత్వానికి సూచించారు. అటు ఐటీ సంస్థలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ చేసేలా సూచించాలని కోరారు..