మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ట్రంప్ ప్రభుత్వం…

భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యత్నం

భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన తర్వాత మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కనపడుతోంది. ఐటీ సేవలు, విదేశాల్లో ఉండి పనిచేసే టెకీలు, ఔట్‌సోర్సు ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ రంగానికి చెందిన సేవలపై ట్రంప్‌ ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉన్నది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చైనా తర్వాత అతిపెద్ద రష్యన్ చమురు కొనుగోలుదారుగా అభివర్ణించారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తే ఇండియా మరిన్ని జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అమెరికా ఇంకా ఫేజ్-2, ఫేజ్-3 సుంకాలను విధించలేదని ట్రంప్ హెచ్చరించారు. భారతదేశంపై ద్వితీయ ఆంక్షలు రష్యాపై ప్రత్యక్ష చర్య అని కూడా ఆయన అన్నారు..ఏడాది జనవరిలో ఓవల్ ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రష్యాపై ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని అడిగినప్పుడు ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. అమెరికా నవంబర్ వరకు చైనాపై అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, భారతదేశంపై భారీ సుంకాలు విధించింది. ఈ నెల ప్రారంభంలో 25 శాతం సుంకం విధించి, ఆగస్టు 27 నుండి అదనంగా 25 శాతం రెండో దశ ఆంక్షలు అమలులోకి వచ్చాయి, దీనితో భారతీయ వస్తువులపై సుంకాలు మొత్తం 50 శాతానికి చేరుకున్నాయి.

ప్రధాన కొనుగోలుదారుల ద్వారా రష్యా చమురు ఎగుమతులను లక్ష్యంగా చేసుకున్నందున, ఈ చర్యలు రష్యాపై ప్రత్యక్ష చర్యకు సమానమని ట్రంప్ పేర్కొన్నారు. చైనా తర్వాత అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారత్‌పై రెండో దశ ఆంక్షలు విధించడం దాదాపు సమానంగా ఉంటుందని మీరు చెబుతారా? ఎటువంటి చర్య తీసుకోలేదని మీరు చెబుతారా? దాని వల్ల రష్యాకు వందల బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి, మీరు దానిని చర్య తీసుకోలేదు అంటారా? నేను ఇంకా ఫేజ్‌-2 లేదా ఫేజ్‌-3 అమలు చేయలేదు అని ట్రంప్ వైట్ హౌస్‌లో పోలిష్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో విలేకరులతో అన్నారు… ట్రంప్ వార్నింగ్ కు భారత్ కూడా అదే తరహాలో సమాధానం ఇవ్వడం కూడా జరుగుతుంది..

భారత టెక్‌ కంపెనీలపై ప్రభావం
విదేశాల్లో ఉండి అమెరికా కంపెనీల కోసం పనిచేసే ఐటీ ఉద్యోగులపై సుంకాలు విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ, బ్యాక్‌ ఆఫీసు సర్వీసులు సమకూర్చడంలో ఖర్చు పెరిగిపోయి కాంట్రాక్టులపై సంస్థలు పునరాలోచనలో పడడం, ధరలు పెంచడం లేదా దేశీయంగా ఉద్యోగుల సేవలు పొందడం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే సైప్లె చెయిన్‌ తెగిపోయి ప్రాజెక్టులు జాప్యం కావడంతోపాటు అమెరికన్‌ మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలకు లాభాల శాతం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.

ఐటీ, సేవల రంగం భారత్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏటా లక్షలాదిమంది ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించి ఐటీ, ఔట్‌సోర్సింగ్‌ సంస్థలకు కొత్త నైపుణ్యాన్ని అందచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌ వంటి ప్రముఖ కంపెనీలు హెచ్‌-1బీ వీసాలను ప్రధానంగా స్పాన్సర్‌ చేస్తున్నాయి.

దీంతో అమెరికాలో టెకీలు ఉద్యోగాలు పొంది ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాకు భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఎగుమతి అయ్యేవి వస్తువులు కాదని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, కన్సల్టెంట్లు, విద్యార్థులని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై సేవా పన్ను విధించిన పక్షంలో అది ఉద్యోగులపైనే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆర్థిక ప్రభావాల కన్నా అధికంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినిప్రతిభావంతులైన ఉద్యోగుల బదిలీ ఆగిపోయి భారతీయ కంపెనీలు తమ మార్కెట్లను మళ్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది..