దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..! మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత దేశం దిగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఉత్పత్తులపై 50శాతం సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. మరికొద్ది రోజుల్లో సుంకాల భారాన్ని పెంచుతామంటూ హెచ్చరికలు చేశారు. అయితే, ట్రంప్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆచితూచి ముందుకు అడుగు వేస్తున్నారు. వ్యూహాత్మకంగా అమెరికాను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ట్రంప్ భారత్‌పై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో కీలక కామెంట్స్ చేశారు..డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టులో భారత ప్రధాని మోదీ గురించి ప్రస్తావించారు. ‘భారత్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు..
వాషింగ్టన్ రావాలని ఆహ్వానం అందింది. కానీ, క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉండటంతో అది సాధ్యం కాదంటూ మోదీ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అయితే తెరవెనక వ్యూహం మాత్రం మరొకటి అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో ఉన్నారు. మోదీని కూడా శ్వేత సౌధం ఆహ్వానించి.. తనతోపాటు మునీర్‌ను అక్కడికి పిలిపించి ఫొటో దిగాలన్నది ట్రంప్ కోరికగా గుర్తించారు. ఇది ఏమాత్రం ఇష్టంలేని ప్రధాని అక్కడికి వెళ్లలేదు. అప్పటి నుంచే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం మొదలయ్యాయి.
ఆ తర్వాత కూడా తాత్కాలిక ట్రేడ్ డీల్ కోసం ప్రధాని మోదీతో మాట్లాడేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కానీ, అప్పటికే ఇరు దేశాల మధ్య విశ్వాసం దెబ్బతినడంతో ఇది సాధ్యం కాలేదు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో అప్పటికే ఇష్టారాజ్యంగా రాతలు రాస్తుండటం, మోదీ కార్యవర్గంలోని వారిని కలవరానికి గురి చేసింది. ఆ తర్వాత ట్రంప్ వైపు నుంచి కాల్స్ వచ్చినా మోదీ వైపు నుంచి ప్రతి స్పందన లేదు. ఇప్పుడు మాత్రం ఆయన స్పందించారు..