దంచి కొడుతున్న వర్షాలు..

హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 2 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్తో పాటు అబ్దుల్లాపుర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో 10.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

భారీవర్షంతో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. పలు కాలనీల్లో వరద నీరు రహదారులను ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొొన్నారు. ట్రాఫిక్కు ఎక్కడికక్కడ అంతరాయం ఏర్పడింది. అటు పంజాగుట్ట, అమీర్ పేట్, మియాపూర్, కొండాపూర్లోనూ భారీవర్షం ముంచెత్తింది.

రాగల మూడు రోజుల పాటు హైదరాబాద్లో వర్షాలు : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం కూడా సికింద్రాబాద్తో పాటు బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది..

మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే, మెదక్‌లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింతగా మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్ కం బోర్డు వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు…