నేటి నుండి ప్రైవేటు కళాశాలలు నిరవదిక బంద్ …

నేటి నుండి ప్రైవేటు కళాశాలలు నిరవదిక బంద్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని సమ్మె బాట పట్టనున్న ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ..

ఈ నెల 21,22వ తేదీల్లో 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్‌లో మహాధర్నా చేపడతామని, దసరా లోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని తేల్చి చెప్పిన విద్యా సంస్థల సంఘాల నాయకులు

ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన కళాశాల యాజమాన్య సంఘాలు

చర్చలు విఫలం కావడంతో, డిమాండ్లు నెరవేర్చేవరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని పేర్కొన్న ఉన్నత విద్యాసంస్థల సంఘాల నేతలు…

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది. దీనికి సంబంధించిన కీలక చర్చలు ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రభుత్వ ప్రతినిధులతో జరిగాయి..సమాఖ్య సర్వసభ్య సమావేశం తరువాత ఈ బంద్‌కు పిలుపు ఇవ్వగా.. దీనిపై చర్చల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ రామకృష్ణారావు ప్రజాభవన్‌లో కళాశాలల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాత్రి 8:45 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు 12:30 గంటల వరకు కొనసాగాయి. చర్చల అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కళాశాలల సమస్యలను తాము అర్థం చేసుకున్నామని, సోమవారం దీనిపై ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బంద్‌ను విరమించుకోవాలని కూడా వారిని కోరారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరగనున్నాయి.