ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన ఇంటికి వచ్చే వారి మెడలో ఏ కండువా వేస్తానో వచ్చేవాళ్లకు ఏం తెలుసని దిల్లీలో నిర్వహించిన చిట్చాట్లో సీఎం మాట్లాడారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ముగిసింది. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత కొరవడిందన్నారు. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీశ్రావు అసెంబ్లీలో వెల్లడిస్తే, 37 కాదు అని కేటీఆర్ ఇంకో సంఖ్య చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన జీతభత్యాల నుంచి ఇప్పటికీ నెలకు రూ. 5 వేలు బీఆర్ఎస్ఎల్పీకి వెళుతున్నాయని చెప్పినట్లు ముఖ్యమంత్రి విలేకరులకు వివరించారు..
కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తున్నారు : మెట్రో విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేటీఆర్ కలిసి మెలికలు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కేటీఆర్ చెబితే దిల్లీలో కిషన్రెడ్డి అదేమాదిరి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న కిషన్రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని, ఎల్ అండ్ టీతో ఒప్పందం ఉంటేనే అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ చెబుతోందని వెల్లడించారు. ప్రాజెక్టు వ్యయానికి ఎల్ అండ్ టీ అడుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని, మెట్రో రైలు విస్తరణకు ఎల్ అండ్ టీ సంస్థ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలో చివరి మైలు వరకు మెట్రో విస్తరించాలని చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ అండ్ టీకి ప్రభుత్వం పలుచోట్ల స్థలాలు ఇచ్చిందని, వాటిని అభివృద్ది చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై ఎల్ అండ్ టీ దృష్టి సారించలేదని చెప్పారు. కేసీఆర్ ఘనకార్యం వల్ల మెట్రోలో రాష్ట్ర ప్రజలపై రూ.3 వేల కోట్ల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ జరిగితే 15 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తారని సీఎం తెలిపారు.
కేటీఆర్, కిషన్రెడ్డి అవినాభావ సంబంధం : కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్రెడ్డి పదేపదే అడిగారని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 48 గంటల్లోనే విచారణ చేపట్టేలా చూస్తా అన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సీబీఐకి కేసు ఇచ్చి ఇన్ని రోజులైనా, దీనిపై కిషన్రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తును ఆపమని కేటీఆర్ చెప్పినందు వల్లే కిషన్రెడ్డి దానిని అమలు చేశారని ఆరోపించారు. కేటీఆర్, కిషన్రెడ్డి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు..