స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు సూచన..!

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అంతర్గతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధికశాతం మంది మంత్రులు అభిప్రాయపడ్డారని పార్టీవర్గాలు వివరించాయి. అయితే, తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లుగా సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా సత్వరమే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు.

త్వరలోనే తుది నిర్ణయం : ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకుని 3, 4 రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్‌కు పంపినప్పటికీ ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి బీజేపీ రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీఓను జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ న్యాయపరమైన అడ్డంకులు ఎదురైతే పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఏవిధంగా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై : చట్టప్రకారం అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు సమాచారం. చివరకు సీఎంకే నిర్ణయం వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ ఇవ్వలేనిపక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరాల్సి ఉంటుందనే దానిపైనా చర్చించినట్లు సమాచారం.