యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై కెటిఆర్ ఆగ్రహం..!

నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై (brs working president ktr) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని.. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌కు వెళ్తామని తెలిపారు. అవసరమైతే (sc ,st) ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు..కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఒకటి మనం చెప్పుకోలేదని అన్నారు. మనది మనం ప్రచారం చేసుకోలేదని చెప్పారు. ఈ ఓటమిలో మన లోపమే ఉందని.. నాయకుడి లోపం లేదని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరూ పనిచేయనంత అద్భుతంగా మన నాయకుడు కేసీఆర్‌ పనిచేశారని పేర్కొన్నారు. ఇంటింటికీ నీళ్లు తెచ్చిండు.. సంక్షేమాన్ని చూపించిండు.. అద్భుతమైన అభివృద్ధి చూపెట్టిండని అన్నారు. అయినప్పటికీ 39 సీట్లకే ఎందుకు పరిమితమయ్యామనే దానిపై విశ్లేషించుకోవాలని సూచించారు. అంతర్మథనం చేసుకోకుండా.. అంతా బాగుందని జబ్బలు సరుచుకుని తిరగవద్దని చెప్పారు.

ఎన్నికల్లో అప్పుడుప్పుడు గెలుస్తుంటాం.. అప్పుడప్పుడు ఓడిపోతుంటామని కేటీఆర్‌ తెలిపారు. అయితే మనకంటే మెరుగైన పరిపాలన, సంక్షేమం అందించే వారి చేతిలో ఓడిపోతే బాధ అనిపించందని.. కానీ కాంగ్రెస్‌ పరిపాలన ఎలా ఉందని అడిగారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారని.. యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిలబడే దుస్థితి వచ్చిందని వాపోయారు. నల్గొండలో యూరియా కావాలని లంబాడా సోదరుడు ఆందోళనలో పాల్గొంటే.. ఆయన్ను గుంజుకొచ్చి పోలీస్‌ స్టేషన్లలో పెట్టి థర్డ్‌ డిగ్రీ ఇచ్చారని మండిపడ్డారు. ఉల్టా ఆయనపై కేసు పెట్టి.. ఇంటికెళ్లి భార్యను బండబూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన నడవరాక కుంటుకుంటూ తిరిగే దుస్థితి వచ్చిందన్నారు. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో చూసి.. ఆ పిల్లాడిని పలకరించి ధైర్యం చెప్పి రమ్మని జగదీశ్‌ రెడ్డికి చెప్పానని అన్నారు. దీనివెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టవద్దని జగదీశ్‌ రెడ్డికి తెలిపానని అన్నారు. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌కు వెళ్దామని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్తామని తెలిపారు..