బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పుర్ తీరాన్ని శనివారం ఉదయం దాటింది. ఇది దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర అల్పపీడనం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వానలతో మూసీనదికి వరద పోటెత్తింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల వ్యవధిలో అత్యధికంగా లింగాయిపల్లి(మెదక్)లో 10.4 సెం.మీ. వర్షం కురిసింది. మానూరు(సంగారెడ్డి)లో 9.2, మేడిపల్లి(వరంగల్)లో 9.1, ఆసిఫాబాద్లో 6.1 సెం.మీ. వర్షం పడింది. మరోవైపు ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో అక్టోబరు 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది..