మద్యం టెండర్ దారులకు షాక్‌.. దరఖాస్తు గడువు పొడిగింపు..

రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తుల ద్వారా ఖజానాకు ఊహించినంత సొమ్ము రాకపోవడంతో దరఖాస్తు గడువును 23వ తేదీ వరకు పెంచింది. అలాగే డ్రా 17న తీస్తామని ప్రకటించింది. దరఖాస్తులకు చివరి రోజున ‘బీసీబంద్‌’ కారణంగా చాలామంది వ్యాపారులు దరఖాస్తులను సమర్పించలేకపోయారని ప్రభుత్వం చెప్తున్నది. తాజా నిర్ణయంతో ఆ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది…

న్యాయ సమీక్షకు నిలబడుతుందా?.

ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం దరఖాస్తుల గడువు పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్ణీత గడువుతో నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా గడువు పొడిగింపు న్యాయపరంగా చెల్లుబాటు కాదని నిపుణులు చెప్తున్నారు. గడువు పెంపుపై ఎవరైనా కోర్టుకెళ్తే, ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలితే గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులుగా మిగిలిపోతారని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఈ మేరకు 2019లో ఏపీలో జరిగిన ఇలాంటి ఘటననే ఉదహరిస్తున్నారు. బార్ల లైసెన్స్‌ గడువు పొడిగింపులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏకపక్ష నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఏపీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి తీర్పు చెప్పారు. ఇప్పుడిదే విషయాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని చెప్తున్నారు.