వీధి శునకాల కేసులో తమ ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే, ఇప్పటివరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ఆక్షేపించింది. వీధి శునకాల బెడద కేసులో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, బంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా,జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది.
ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. వీధికుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా, చలనం లేదా అని ధర్మాసనం ఆక్షేపించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొంది. సీఎస్లు హాజరుకాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకున్నా, జరిమానాతో పాటు చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. దిల్లీ-ఎన్సీఆర్ రీజీయన్లో వీధి శునకాలకు సంబంధించిన అంశాన్ని కొన్ని నెలల కింద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎలా ఉందనే అంశాన్ని తెలపాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..