మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. డివిజన్ల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ల విభజనపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు కార్పొరేటర్లు మాట్లాడారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ వివరణ : జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను ప్రభుత్వం 300కు పెంచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. వార్డుల సంఖ్య పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశామని చెప్పారు. సరిహద్దులు, తదితర వివరాలు జీవో 266లో పొందుపర్చామన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వార్డుల పెంపుపై అభ్యంతరాల స్వీకరణ రేపటితో ముగుస్తుందని పేర్కొన్నారు. వార్డుల పునర్విభనపై కొందరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని వివరించారు.
జీవో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దుల ప్రకారం పునర్విభజన చేస్తున్నామని వెల్లడించారు. నాలాలు, మేజర్ రోడ్లు, ల్యాండ్‌మార్కులు, రైల్వేలైన్ల మేరకు పునర్విభజన ఉంటుందన్నారు. పాత రికార్డుల్లోని సర్వే నంబర్ల ప్రకారం వార్డుల పునర్విభజన చేస్తున్నామని చెప్పారు. ఏ వార్డును కూడా అసెంబ్లీ పరిధి నుంచి మార్చట్లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశంలో పేర్కొన్నారు.
ఎలాంటి సమాచారం లేదు : వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామని, విలీనం శాస్త్రీయంగా జరిగిందా? లేదా? అనే ఆవేదన అందరిలో ఉందన్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 17 చివరి తేదీగా ప్రకటించారని తెలిపారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ కావున అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని కోరారు.
అసెంబ్లీ పరిధిలోనే వార్డుల పునర్విభజనను స్వాగతిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధి 600 చ.కి.మీ. నుంచి 2 వేల చ.కి.మీకు పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళిక ఏం చేపట్టారని ప్రశ్నించారు. వార్డుల పునర్విభజనతో పాటు బడ్జెట్ పెంపును పరిగణనలోకి తీసుకున్నారా అని అడిగారు. వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరుతున్నానని వివరించారు. మేయర్, కమిషనర్ ఛాంబర్లోనూ కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
విలీనం గురించి మేయర్‌కు కూడా తెలియదు : సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా విలీనం చేశారని దాసోజు శ్రవణ్ తెలిపారు. సీజీజీ నివేదిక ఆధారంగా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. విలీనం గురించి తెలియదని మేయర్ కూడా ఒప్పుకున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీలతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీజీజీ నివేదికను జీహెచ్ఎంసీ సమావేశంలో ఎందుకు ప్రవేశపెట్టలేదన్నారు. అశాస్త్రీయంగా, ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.