జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ..జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు…!
జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆ నివేదిక ఇంత వరకు బయటపెట్టలేదు : జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో 80కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎంసీహెచ్ఆర్డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
పూర్తి సమాచారం వెబ్సైట్లోనే పెట్టాం : భౌగోళికంగా, జనాభాపరంగా పునర్విభజన జరగలేదని ధర్మాసనం వద్ద విన్నవించారు. చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది గత బుధవారమే కోర్టుకు వివరించారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే వెబ్సైట్లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున దీంట్లో కల్పించుకోలేమంటూ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.
పురపాలక, జీహెచ్ఎంసీల చట్టాల సవరణ : జీహెచ్ఎంసీని దేశంలోనే అతి పెద్ద నగరంగా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రేటర్ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర సర్కారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 నగర, పురపాలక సంస్థల విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికోసం మంత్రివర్గంలో చర్చించి శ్రీకారం చుట్టింది. విలీన ప్రక్రియ కోసం పురపాలక, జీహెచ్ఎంసీ చట్టాల సవరణ కూడా చేసింది. దీని ద్వారా గ్రేటర్లో కొత్తగా కలిపే ప్రాంతాల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలపై ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్స్, ఇతర ఫీజుల భారం పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మహానగరంలో రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతుంది.