కొత్త సంవత్సరం కొత్త అభివృద్ధి..
నూతన సంవత్సరంలో పల్లెలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు యథావిధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు చొప్పున ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్) కేటాయిస్తామని ప్రకటించారు.
శాసన సభ్యులు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచిలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఉపయోగించాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొడంగల్ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తామన్న సీఎం నూతనంగా ఎన్నికైన సర్పంచిలు గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా సేవ చేయాలని పిలుపునిచ్చారు.