రేపటి నుంచి..నల్లగొండ జిల్లావ్యాప్తంగా.. ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలు.-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

రేపటి నుంచి.. నల్లగొండ జిల్లావ్యాప్తంగా..
‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలు.-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

_జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు, రేపటి నుంచి *(బుధవారం) నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్* ’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు._

_ఈ నిర్ణయం ప్రకారం, జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు._

_ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి ఈ నిబంధన అమలుపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు._

_రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సంభవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని,ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.