కోదాడ.. చలో కోదాడ నిరసన ర్యాలీ..!

దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శ‌నివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ‌లో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్….

బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్య జరిగి 60 రోజులు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. టూరిస్టులుగా మారిన ఉత్తమ్ దంపతుల పాలనలో కోదాడలో షాడో ఎమ్మెల్యేల రాజ్యం, మాఫియా పాలన నడుస్తోందని ఆరోపించారు. పోలీసులకు అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం, ఆస్తి నష్టం కలిగించడం, దిమ్మెలు పగలగొట్టడం వంటి ఘటనలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్పా ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ వ్యవహార శైలి పూర్తిగా రౌడీకి కాకి చొక్కా తొడిగినట్లు ఉందని మండిపడ్డారు. ఆయన గత చరిత్ర మొత్తం అవినీతిమయమైందని, కోదాడలో కూడా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులను ఇక సహించేది లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందుముందు తీవ్ర పరిణామాలు తప్పవని ఆయ‌న‌ హెచ్చరించారు..గతంలో తాను అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పోలీసులతో ఎలాంటి మర్యాదతో, బాధ్యతాయుతంగా వ్యవహరించేవాడినో ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకు బాగా తెలుసని అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి వేళల్లో పోలీసులతో ఏ విధంగా మాట్లాడుతారో కూడా ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయ‌న కోరారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు చేసిన దాడులను పోలీస్ యంత్రాంగం పట్టించుకోకున్నా తాము కూడా ఓపికతో భరించామని, కానీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతూ, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే పరిస్థితులు చేయి దాటుతాయని అటువంటి సందర్భంలో దాడులకు ప్రతిదాడులు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.