మణిపూర్లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక గెజెట్ ద్వారా ప్రకటన చేసింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను తక్షణమే ఉపసంహరించారు. కేంద్రం నిర్ణయం మేరకు, రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధమైన, సాధారణ రాజకీయ వ్యవస్థ పునరుద్ధరించబడింది. రేపు సాయంత్రం ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఖేమ్చంద్ సింగ్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2022లో బీరెన్ సింగ్ కేబినెట్లో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు….మణిపూర్లో గత సంవత్సరం నెలకొన్న అస్థిరత, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన రద్దు కావడం వల్ల, మణిపూర్లో తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం లేదా కొత్త రాజకీయ సమీకరణాలు బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని శాంతిభద్రత పరిస్థితులు మెరుగుపడటంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఖేమ్చంద్ ఎన్నిక – ఏకాభిప్రాయం: దిల్లీలోని మణిపుర్ భవన్లో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో ఖేమ్చంద్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీతో పాటు NPP, NPF మరియు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. తరుణ్ చుగ్, సంబిత్ పాత్రా వంటి కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఈ ఎంపిక ప్రక్రియ ముగిసింది.
అష్టదిగ్బంధ వ్యూహం – ఉపముఖ్యమంత్రి పదవులు: హింసకు ప్రధాన కారణమైన జాతుల మధ్య విభేదాలను తొలగించేందుకు బీజేపీ ‘సోషల్ ఇంజనీరింగ్’ అస్త్రాన్ని ప్రయోగించింది. ముఖ్యమంత్రిగా మైతేయ్ వర్గానికి చెందిన ఖేమ్చంద్ను నియమిస్తూనే, కుకీ వర్గానికి చెందిన మహిళా నేత నెమ్చా కిప్గెన్ను ఉపముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉంది. అలాగే నాగాలకు మరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది. తద్వారా అన్ని వర్గాల ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ శాంతిని నెలకొల్పాలని చూస్తోంది.
ఖేమ్చంద్ సింగ్ ప్రస్థానం: సింగ్జమేయి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఖేమ్చంద్, తైక్వాండో క్రీడాకారుడిగా క్రమశిక్షణ గల నేతగా పేరు తెచ్చుకున్నారు. గతంలో స్పీకర్గా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మైతేయ్, కుకీ, నాగా.. ఈ మూడు వర్గాలతోనూ సత్సంబంధాలు కలిగి ఉండటమే ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.