సోనియా గాంధీ మీద ఒట్టేసి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఇస్తామని రేవంత్ చెప్పి 26 నెలలవుతున్నా అమలు కావడం లేదు.. కేటీఆర్..
కాంగ్రెస్ పాలన ఉన్నన్నాళ్లూ ప్రజలకు కన్నీళ్లు తప్పవని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలో రేవంత్ సర్కార్ రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండూ ఢిల్లీ పార్టీలేనని, తెలంగాణకు ఏమీ చేయవని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఈ రెండు పార్టీల నాయకులకు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. ‘మీరు వేసే ఓటుతో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలి’ అని ఆకాంక్షించారు. ‘పదేండ్లలో చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు ఉన్నది.. ఢిల్లీ పార్టీలకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని కోరారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం ఆయన వేములవాడ, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయాలంటు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సోనియా గాంధీ మీద ఒట్టేసి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఇస్తామని రేవంత్ చెప్పి 26 నెలలవుతున్నా అమలు కావడం లేదని విమర్శించారు. ‘ఇప్పటికి 800 రోజులైనా పింఛన్లు పెంచి ఇయ్యలే, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, యువతకు స్కూటీలు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మీ, తులం బంగారం, ఇవ్వలే’ అని తూర్పారబట్టారు.
ఇస్తామన్న ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒకదాన్నైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ‘ఇన్ని మోసాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలకు మేం చేస్తున్నదే సరైందని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. హామీల అమలుపై భవిష్యత్తులో దృష్టి పెట్టే అవకాశమే ఉండదు’ అని హెచ్చరించారు. అందుకే ఇంటికి వచ్చే ఆ పార్టీ నాయకులను ముందుగా 26 నెలలుగా బాకీపడిన పెన్షన్ లక్ష రూపాయలు, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 బాకీ రూ.65 వేలు. కల్యాణలక్ష్మీ చెకుతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పినప్పుడే తాము చేస్తున్న మోసాలపై ప్రజలు కోపంగా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు తెలుసుకుంటారని చెప్పారు..
పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి, మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి ఆయనేనని కొనియాడారు. కేసీఆర్ గారు ఎప్పుడూ బిరుదుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని కేటీఆర్ స్పష్టం చేశారు.
నేడు అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదని ఆయన హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది.. వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ మరియు ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే కానీ, రేవంత్ రెడ్డి తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడి పోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని, ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డీఏలు మరియు పీఆర్సీ లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కేటీఆర్ కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి ‘కోవర్టు’ ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజల తీర్పే కేసీఆర్ గారికి ఇచ్చే అసలైన గౌరవమని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని ఆయన కోరారు.
చివరగా, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలమని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.