కాళేశ్వరం కాదు.. అది కూలేశ్వరం… CM రేవంత్ రెడ్డి..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శనివారం జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రతిపక్షాల కుట్రలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా భయపడే ప్రసక్తే లేదు. ఐదేళ్ల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. రాబోయే ఎనిమిదేళ్లూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు…ప్రభుత్వం పడిపోతుందని మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు. ‘అప్పుడే దిగిపోవాలని కోరుకుంటున్నారా? కేసీఆర్‌.. కల్వకుంట్ల కిషన్‌రావు (కిషన్ రెడ్డిని ఉద్దేశించి).. రాసి పెట్టుకోండి, ప్రజల ఆశీస్సులతో మరో ఐదేళ్లు కూడా మేమే అధికారంలోకి వస్తాం. మీరు, మీ తాతలు అడ్డం వచ్చినా అభివృద్ధిని ఆపలేరు’ అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్, బీజేపీలు స్థానిక సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.

గోదావరి జలాలపై కేసీఆర్ నిర్లక్ష్యం
రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి విమర్శించారు. నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు సలహాలు ఇవ్వడానికే కేసీఆర్ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ‘గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే కేసీఆర్ కళ్లప్పగించి చూశారు. అందులో 300 టీఎంసీలు రంగారెడ్డికి ఇచ్చి ఉంటే 30 లక్షల ఎకరాలు పారేవి కదా? ఆనాడు రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని ఏవేవో మాటలు చెప్పారు తప్ప, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

కాళేశ్వరం కాదు.. అది కూలేశ్వరం..

కేసీఆర్ అహంకారానికి నిదర్శనమైన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలేశ్వరంగా మారిందని సీఎం విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లు మాత్రమే బాగుపడ్డాయని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ. 38 వేల కోట్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే, కేసీఆర్ దాని స్వరూపాన్నే మార్చి వేల కోట్లు కొల్లగొట్టారని అన్నారు…