బాల్క సుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులకు బెయిల్‌..!

బాల్క సుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. క్యాతన్‌పల్లిలో ప్రజా తీర్పుకు కట్టుబడి.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేసిన బాల్క సుమన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసినా.. జైలులో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురి చేసినా.. జైలు నుంచి బయటికి రాకుండా పాత కేసులను తవ్వి పీడీ యాక్ట్‌ పెట్టాలని కుట్రలు చేసినా.. చివరకు బెయిల్‌ రాకుండా అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేవి ఫలించ లేదు.

బాల్క సుమన్‌పై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురి చేయాలని చూసిన సర్కార్‌, పోలీసులకు చెంపపెట్టులా.. మంచిర్యాల జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. బాల్క సుమన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్‌, రామిడి లక్ష్మీకాంత్‌లకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చినట్లు బాల్క సుమన్‌ న్యాయవాదులు రవీందర్‌రావు, మల్లేశ్‌గౌడ్‌ తెలిపారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రెండు షూరిటీలు, మూడు నెలలపాటు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలనే షరతులతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిందన్నారు.