భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు..భారత్‌కు ఇరాన్ కిలక హామీ

ఇజ్రాయెల్, అమెరికా (Israel-US) తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకల రాకపోకలపై గత కొన్నాళ్లుగా ఇరాన్‌ (Iran) ఆంక్షలు విధించింది…ఈ నేపథ్యంలో భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. ‘భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వారు సురక్షితంగా ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన చేసింది. ఈ భరోసాతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణా జరిగే హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాతో వివాదం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గంలో రాకపోకలను దాదాపు నిలిపివేసింది. అయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇరాన్ స్పష్టంచేసింది. ఈ దిగ్బంధనంవల్ల భారత్ సహా పలుదేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇప్పటికే 8 భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. వీటిలో BW TYR, BW ELM అనే రెండు ఎల్‌పీజీ క్యారియర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 94 వేల టన్నుల ఎల్‌పీజీ భారత్‌కు చేరింది. అయితే భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ, ముడిచమురు, ఎల్‌ఎన్‌జీతో కూడిన మరో 19 నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ కుమార్ సిన్హా ఈ వివరాలు వెల్లడించారు.

చిక్కుకున్న నౌకల్లో భారత్‌కు చెందినవి 9 ఉండగా.. విదేశీ జెండాలతో భారత్‌కు వస్తున్నవి 10 ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు జలసంధిలో నిలిచిపోయినట్లు సమాచారం..

సదస్సు ముఖ్య ఉద్దేశాలు..

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఈ వారం చివర్లో 35 దేశాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని పునరుద్ధరించడం, జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు, నావికుల భద్రతకు హామీ ఇవ్వడం ప్రధాన లక్ష్యం. అలాగే ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ వంటి అత్యవసర సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించేందుకు గల దౌత్య, రాజకీయ మార్గాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

భారత్ ముందస్తు చర్యలు.. ఆరు నౌకలు సేఫ్

నౌకల సురక్షిత ప్రయాణానికి సంబంధించి భారత్ ఇప్పటికే ఇరాన్ సహా ఇతర సంబంధిత దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని రణ్‌ధీర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ తదితర ఉత్పత్తులతో వెళ్తున్న ఆరు భారతీయ వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటగలిగాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులోనూ తమ నౌకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అన్ని పక్షాలతో టచ్‌లో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.