శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన దాయాది పాకిస్థాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్..వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చల ఫలితంతో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనిపై అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధాన్ని ముగించి, అంతర్జాతీయంగా తాము శాంతిదూతలమని ప్రచారం చేసుకునేందుకు పాకిస్థాన్ ఊవిళ్లూరుతోంది. అందుకోసం మధ్యవర్తిత్వం వహించిన పాక్.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది.
రాజధాని ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో ఈ చర్చలకు ఏర్పాట్లు చేసింది. అమెరికా, ఇరాన్ తరఫున భారీ సంఖ్యలో ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కానీ, శాంతి చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు అయితే, పాకిస్థాన్‌కు మాత్రం హోటల్ బిల్లు తడిసి మోపుడయ్యిందని నిఘా వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల బిల్లుల్ని పాకిస్థాన్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెల్లించలేదట. దీంతో దీనిని పరిష్కరించేందుకు హోటల్ యజమాన్యం అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.
అమెరికా, ఇరాన్ ప్రతినిథులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అయ్యే సాధారణ ఖర్చులను కూడా చెల్లించడంలో ఇస్లామాబాద్ విఫలమైందని తెలిపాయి. పాకిస్థాన్ దౌత్య ఆశయాలకు, ఆ దేశంలో నెలకున్న అంతర్గతంగా ఉన్న ఆర్థిక అస్థిరతకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ”ఒక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ ప్రాథమిక వైఫల్యం, సాధారణ కార్యాచరణ చెల్లింపులను కూడా నిర్వహించడంలో దేశం అసమర్థతను బయటపెడుతోంది” అని అగ్రశ్రేణి నిఘా వర్గాలు తీవ్రతను నొక్కిచెబుతూ పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా గమనిస్తోన్న ఒక దౌత్యపరమైన కార్యక్రమం సందర్భంగా ఆతిథ్య దేశం తన ఆర్థిక కట్టుబాట్లను నెరవేర్చడంలో విఫలకావడం అనేది, పరిపాలనా, ఆర్థిక బలహీనతపై ఉన్న అభిప్రాయాలను మరింత బలపరిచింది.
ఇక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు పాక్ నానా అవస్థలు పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సాయం తీసుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు, ద్రవ్యోల్బణం 7-9 శాతం మధ్య ఉంది. ఈ సమస్యల నేపథ్యంలో మరోసారి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది..