జిమ్ ట్రైనర్’ వదిలి బొండు బాబు అవతారం..!

ఇతను గతంలో జిమ్ ట్రైనర్‌గా పనిచేసేవాడు. నిందితుడి పేరు రిథమ్ పంచాల్. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఇతనిని ‘భోండు బాబా’ అని పిలుస్తారు. ఈ 37 ఏళ్ల వ్యక్తి, జిమ్ ట్రైనర్‌గా తన పనిని వదిలేసి, ఆధ్యాత్మిక గురువుగా అవతారం ఎత్తాడు. అర్ధరాత్రి పూట, అసాధారణ సమయాల్లో మహిళలను తన ఇంటికి పిలిపించుకునేవాడు. పూజలు, అఘోరా ఆచారాలు, మూఢనమ్మకాల పేరుతో భక్తులను దోచుకోవడమే కాకుండా వారిని లైంగికంగా వాడుకున్నాడు. ఇప్పటివరకు 60 మందికి పైగా బాధితులు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాలుగేళ్ల క్రితం వరకు పంచాల్ జిమ్ ట్రైనర్‌గా సాధారణ జీవితం గడిపేవాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో, దేవుడి ప్రతిరూపం లాగా నటించడం ప్రారంభించాడు. ప్రజల నమ్మకాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి గురువారం, శనివారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సెషన్స్ నిర్వహించేవాడు. తాను దేవుడి అవతారమని, ఎలాంటి వ్యక్తినైనా, ఏ జబ్బునైనా నయం చేయగలనని, ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసగించేవాడు. పూజల పేరుతో అర్ధరాత్రి మహిళలు, బాలికలను పిలిపించి అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. పంచాల్ భారీగా డబ్బులు, ఖరీదైన మద్యం, సిగరెట్లు, ప్రాణంతో ఉన్న కోళ్లు, మేక కాలేయం డిమాండ్ చేసేవాడు. తనకు పూనకం వచ్చినట్లు నటించి, దెయ్యాన్ని వదిలించే ఆచారాలలో భాగంగా బాధితుల నోట్లో సిగరెట్లను ఉంచేవాడని ఆరోపణలు ఉన్నాయి. దిండోషి పోలీసులు నిందితుడిపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే 60 మందికి పైగా ఫిర్యాదు చేశారు.