యూరియా యాప్‌ గందరగోళంగా ఉన్నదని, దానిని రద్దు చేయాలని హైకోర్టులో పిల్..

రైతులకు యూరియా సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌ గందరగోళంగా ఉన్నదని, దానిని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ గౌస్‌మీరా మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది..రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూరియా సరఫరాకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు తెలపాలని కోరింది. గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యం లో యూరియా సరఫరాకు అమలు చేస్తున్న విధివిధానాలు తెలియజేయాలని ఆదేశించింది. రైతులు అందరూ సాంకేతిక నిపుణులు కారని, వారిలో ఎంతమందికి ఫోన్లు ఉంటాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకునే సాంకేతికత సామాన్య గ్రామీణ రైతులకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది.

నాలుగు వారాల్లో కౌంటర్‌
యూరియా యాప్‌ను రద్దుచేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మరో నలుగురు రైతులు ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున పాశం రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. యూరియా సరఫరా సక్రమంగా లేదని, అంతా అస్తవ్యస్తంగా మారిందని, రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలిపారు. యూరియా అందక రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్య పరిషరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని అన్నారు. అసైన్డ్‌ భూములున్న రైతులకు యూరియా సరఫరా చేయడంలేదని చెప్పారు.

దీనిపై ప్రభుత్వ న్యాయవాది మోహనారెడ్డి ప్రతివాదన చేస్తూ.. యూరియా సమస్య పరిషారానికి, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించిందని చెప్పారు. యూరియా బ్యాగ్‌ రూ.3 వేలు ఉండగా ప్రభుత్వం అత్యధిక సబ్సిడీతో రూ.266కే అందజేస్తున్నదని తెలిపారు. యాప్‌ ద్వారా అర్హులైనవారు ముందుగా నమోదు చేసుకుంటే వెంటనే తీసుకెళ్లవచ్చని తెలిపారు క్యూలో కూడా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఫోన్‌ లేనివారికి, యాప్‌ పట్ల అవగాహన లేనివారికి సహాయం చేయడానికి ఆయా కేంద్రాల్లో వలంటీర్‌ అందుబాటులో ఉన్నారని తెలిపారు. రైతుకు ఫోన్‌ లేకపోయినా స్నేహితులు, బంధువుల ఫోన్ల ద్వారా బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు..