అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణ ప్రకంపనలు రేపుతోంది…!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అయితే ఈ చర్చల్లో భాగంగా ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు చేయడం ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ ఇలాంటి చర్యలకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే సమయంలో.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తీసుకునేందుకు రష్యా రెడీగా ఉందన్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము కూడా మధ్యవర్తిత్వం వహిస్తామని హామీ ఇచ్చారు..మరోవైపు చాలాకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చల్లో సానుకూల సంకేతాలు వచ్చాయి. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ కోసం ట్రంప్ సూచనలను పుతిన్ స్వాగతించారని రష్యా విదేశీ సలహాదారు యురి ఉషకోవ్ తెలిపారు. దీన్నిబట్టి ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఓవైపు ఇరాన్ అంశంలో హెచ్చరికలు చేస్తూనే ఉక్రెయిన్ విషయంలో కాల్పుల విరమణకు సహకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.