చెన్నై: విజయ్ కింగ్ అవుతారంటూ మరో సర్వే..
_• విజయ్ పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచనా.._
*• ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు..*
_• మొత్తం 234 నియోజకవర్గాల్లో 121 సీట్లు గెలిచే ఛాన్స్.._
_• డీఎంకే, ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుకు భారీ గండి.._
_• సర్వే చేసిన మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలిసారే.. విజయ్ ఏమేరకు ప్రభావం చూపగలరు? ఘన విజయాలను నమోదు చేసి ఆశ్చర్య పరుస్తారా? చాలామంది సినీ నటులు రాజకీయ అరంగేట్రంలో తల బొప్పి కట్టించుకున్నట్టుగా తాను కూడా ఎదురుదెబ్బకే పరిమితమవుతారా? అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ లో ఒక సంస్థ మాత్రం.. విజయ్ కు స్పష్టమైన మెజారటీని కట్టబెడుతూ అధికారంలోకి వస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది. ఆ సంస్థ అంచనా నిజమైతే అదొక నవచరిత్ర అవుతుంది. ఎవరు ఎన్నిరకాలుగా తొక్కిపెట్టడానికి ప్రయత్నించినా సరే.. అడ్డంకులను చీల్చుకుంటూ తాను పైకి ఎదగగలనని విజయ్ నిరూపించినట్లు కూడా అవుతుంది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. వీటిలో మూడుచోట్ల ఫలితాలు దాదాపు ఏకపక్షంగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే తరహా ఫలితాలను అంచనా వేశాయి. ఆ ప్రకారం.. కేరళలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న ఎల్డీఎఫ్ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే అసోంలో భారతీయ జనతా పార్టీ, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేస్తూ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నాయనేది మరో అంచనా…ఈ మూడు రాష్ట్రాల విషయంలో చర్చోపచర్చలు జరిగేంతగా పరస్పర విరుద్ధమైన అంచనాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. కానీ, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ- బిజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీదీ దళం.. హోరాహరీ పోరు అనే అంచనాను కూడా స్వీకరించలేకపోతోంది. 2021లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయని టీఎంసీ నేతలు అంటున్నారు. కొన్ని సర్వేలు వారికే అధికారం కట్టబెట్టినా, మరికొన్ని సర్వేలు బిజెపికి కూడా అధికారం దక్కుతుందని అంచనా వేయడం మింగుడుపడ్డం లేదు. ఇక పోతే తమిళనాడు సంగతి.
భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఇప్పటిదాకా ఎదురుచూస్తున్న రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. సినీ హీరో విజయ్ రంగప్రవేశంతో ఈ దఫా తమిళనాట ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విజయ్- ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను కూడా సమానంగా తూర్పారపడుతూ.. ఎన్నికల ప్రచారపర్వంలో ముందుకు వెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే.. తెలుగునాట ఒకసారి సొంతంగా బలాన్ని పరీక్షించుకోవాలని అనుకుని-తర్వాత చంద్రబాబు జట్టులోకి చేరిపోయి ఆయన భజన చేస్తూ గడుపుతున్న హీరో పవన్ కల్యాణ్ కంటె చాలా రెట్లు మెరుగు అనే అభిప్రాయం కల్పించారు విజయ్.
ఎందుకంటే.. 2019 నాటనికి పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని స్థాపించి అయిదేళ్లకు పైగానే గడిచాయి. కానీ ఆయన ఆ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగే సాహసం చేయలేకపోయారు. కులపరమైన ఓటు బ్యాంకులను రాబట్టడంలో సక్సెస్ అయ్యారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ దశ వచ్చింది. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేనే మళ్లీ ఘనవిజయం నమోదు చేయబోతున్నదని అనేక సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. తమిళనాడులో 8 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. అయిదు సంస్థలు ఏకపక్షంగా డీఎంకేకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టాయి. మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, పీమార్క్, పీపుల్స్ ఇన్ సైట్, ప్రజాపోల్ సంస్థల సర్వేల్లో డీఎంకే కనీసం 120కు పైగా సీట్లు వచ్చేలా ఫలితాలు ఉన్నాయి. కామాఖ్య అనలిటిక్స్ వారి ఫలితాలు మాత్రం హంగ్ ను సూచిస్తున్నాయి.
అలాగే జేవీసీ వారు అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమికే అధికారం కట్టబెట్టారు. ఇకపోతే ఎన్డీటీవీ చానెల్ వారు యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో విజయ్ పార్టీదే పైచేయిగా ఉంది. అయితే వీరు కూడా విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 98 నుంచి 120 సీట్ల వరకు గెలవవచ్చునని అంచనా వేసింది. అయినా అది కూడా గొప్ప విషయమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
చాలా సర్వేలు ఆయనకు రెండంకెల సీట్లు మాత్రమే ఇచ్చాయి. ఎన్డీటీవీ త్రిముఖ పోటీలో తొలిస్థానం కట్టబెట్టింది. తొలి ప్రయత్నంలోనే విజయ్ ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ మరిన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్ గా నిలవగలిగినా కూడా గొప్ప విషయమే అని అందరూ అంచనా వేస్తున్నారు. విజయ్ మద్దతు అనివార్యమైన స్థితిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా కూడా.. విజయ్ చరిత్ర సృష్టించినట్టుగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.