తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి MLAలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ రాజీనామా..!

అన్నాడీఎంకే పార్టీకి బిగ్ షాక్..!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి MLAలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ రాజీనామా

స్పీకర్‌కు రాజీనీమా లేఖలు సమర్పించిన ఎమ్మెల్యేలు

బలపరీక్ష సమయంలో సీఎం విజయ్‌కి మద్దతివ్వగా.. ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి సిద్ధమైన ఎమ్మెల్యేలు..

ఎన్నికల ఓటమి తర్వాత అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీకి తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు—మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ—సోమవారం తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ వీరి రాజీనామాలను ఆమోదించిన వెంటనే, ఈ ముగ్గురు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలలో వీరు కూడా ఉన్నారు. రాజీనామా అనంతరం ఈ ముగ్గురు నేతలు టీవీకే మంత్రి ఆధవ్ అర్జునను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో కలిశారు…మరోవైపు ఏఐఏడీఎంకే అంతర్గత రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెబెల్ గ్రూపులోని సీవీ షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) గూటికి చేరుకున్నారు. దీంతో పళనిస్వామి వర్గం బలం 27కు పెరగగా, రెబెల్స్ సంఖ్య 25 నుండి 17కు పడిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఏఐఏడీఎంకే 47 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి కొద్దిగా దూరమైన విజయ్.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఏఐఏడీఎంకే రెబెల్స్ కూడా వెలుపల నుండి మద్దతు ఇచ్చారు. అయితే పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని, పళనిస్వామి తమ నాయకుడని సీనియర్ నేత ఎస్పీ వేలుమణి స్పష్టం చేయడం, తాజా రాజీనామాలతో తమిళనాడు రాజకీయం ఆసక్తికరంగా మారింది…

ప్రస్తుతం ఇదే విషయంపై తెలంగాణలో కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది…

బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారు కూడా దీని అనుసరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి…..