ఎక్కువసేపు జిమ్‌లో వ్యాయామం చేయడం వల్లే జుట్టు ఊడిపోతుందా..!

చాలామంది శరీరం ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించే యువకులు జుట్టు రాలుతోందని ఆందోళన చెందుతున్నారు.Overexercising ఎక్కువసేపు జిమ్‌లో వ్యాయామం చేయడం వల్లే జుట్టు ఊడిపోతుందని భావిస్తుంటారు. అయితే నిపుణులు మాత్రం వ్యాయామం ఒక్కటే దీనికి కారణం కాదని చెబుతున్నారు…ఇది సాధారణంగా జుట్టుకు హాని కలిగించదు. అయితే అధిక వ్యాయామం, తక్కువ ఆహారం, సరైన విశ్రాంతి లేకపోవడం వంటి అంశాలు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ పరిస్థితుల్లో కొంతకాలం పాటు జుట్టు రాలే అవకాశం ఉంటుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం. ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి పోషకాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కఠినమైన డైట్‌లు పాటించే వారికి ఈ పోషకాల లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారిలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. ఈ కారణంగా జుట్టు రాలడం కొన్ని వారాలు లేదా నెలల తర్వాత ప్రారంభమవుతుంది. అందువల్ల చాలామంది అసలు కారణాన్ని గుర్తించలేకపోతారు.శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడితే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి. ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా మార్చడం, అధికంగా వ్యాయామం చేయడం వంటి కారణాలు శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి. దీంతో జుట్టు రాలే దశ ప్రారంభమవుతుంది. అయితే ఈ రకమైన సమస్య ఎక్కువగా తాత్కాలికమే. శరీరం కోలుకున్న తర్వాత జుట్టు పెరుగుదల మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చు.

బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అయ్యే వారిని లేదా త్వరగా బరువు తగ్గాలనుకునే వారిని చూస్తే… వారు తినే ఆహారాన్ని ఒక్కసారిగా తగ్గిస్తారు, గంటల తరబడి వర్కౌట్స్ చేస్తారు, కానీ బాడీ రెస్ట్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వరు. బరువు తగ్గుతున్నట్లు కనిపించినప్పటికీ, లోపల శరీరం మాత్రం ఈ మార్పులను తట్టుకోలేక ఒత్తిడికి గురవుతుంది.

మన శరీరంలో జరిగే మార్పులను జుట్టు చాలా త్వరగా పసిగడుతుంది. శరీరంలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లాంటి ముఖ్యమైన పోషకాలు తగ్గినప్పుడు, జుట్టు పెరిగే ప్రక్రియ ఆగిపోతుంది. కఠినమైన డైటింగ్ చేసేవారిలో, వేగంగా బరువు తగ్గే వారిలో ఇటువంటి పోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్ తెలిపారు..

జుట్టు రాలడానికి అసలు కారణం
సప్లిమెంట్లు, కఠినమైన వర్కౌట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా… పురుషులలో బట్టతల రావడానికి ముఖ్య కారణం జన్యువులే (Heridity). కొంతమంది పురుషులలో ఉండే కేశ కుదుళ్లు (Hair follicles) పుట్టుకతోనే ‘DHT’ (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్‌ను తట్టుకోలేవు. ఈ DHT హార్మోన్ జుట్టు కుదుళ్లను చిన్నవిగా చేసేస్తుంది. దీనివల్ల ప్రతిసారీ జుట్టు సన్నగా, బలహీనంగా మొలుస్తుంది. చివరికి అక్కడ అస్సలు జుట్టు పెరగడమే ఆగిపోతుంది. మీరు వారానికి ఆరు రోజులు జిమ్‌కు వెళ్లినా, లేదా అస్సలు వెళ్లకపోయినా… మీ జన్యువులలో బట్టతల వచ్చే అవకాశం ఉంటే అది జరిగి తీరుతుంది..

ఫిట్‌నెస్ ప్రపంచంలో జుట్టు రాలడానికి డైరెక్ట్ ప్రభావం చూపే ఒకే ఒక్క విషయం. స్టెరాయిడ్స్ వాడటం. బాడీని త్వరగా పెంచడానికి వాడే ఇటువంటి మందులు శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను విపరీతంగా పెంచేస్తాయి. జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్న పురుషులు వీటిని వాడినప్పుడు, వారి శరీరంలో DHT స్థాయిలు మరింత పెరిగి, జుట్టు చాలా వేగంగా పల్చబడిపోతుంది. అందుకే ఒకే రకమైన స్టెరాయిడ్ వాడినా ఇద్దరు వ్యక్తుల్లో వేర్వేరు ఫలితాలు ఉంటాయి. ఒకరికి జుట్టు విపరీతంగా ఊడిపోతే, మరొకరికి ఏ మార్పూ కనిపించకపోవచ్చు. జుట్టు రాలడానికి అసలైన కారణం జన్యువులే. అయితే, బాడీ బిల్డింగ్ కోసం వాడే స్టెరాయిడ్లు దీనిని మరింత త్వరగా ఎక్కువ చేస్తాయి.