మాట తప్పితే మళ్లీ సైనిక దాడులు చేస్తాం.. ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై వర్చువల్‌గా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. ఒకవేళ భవిష్యత్తులో ఆ దేశం మాట తప్పినా లేదా ఈ ఒప్పందం తనకు నచ్చకపోయినా.. మళ్లీ సైనిక దాడులు చేస్తామని హెచ్చరించారు. పారిస్ పర్యటనలో భాగంగా ట్రంప్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన ఈ 14 సూత్రాల ఒప్పందం తాత్కాలికమైనదన్నారు. అయితే ఇరాన్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే మళ్లీ దూకుడు ప్రదర్శిస్తామని అమెరికా వెల్లడించింది. .చర్చల్లో భాగంగా.. భవిష్యత్తులో చాలా కాలం పాటు అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ సంపూర్ణంగా అంగీకరించిందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్య ఇరాన్ అణు నిజాయితీని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. అణు తనిఖీలను ఇరాన్ అంగీకరించడం చర్చలకు కీలకమైన షరతు అని.. ఒకవేళ ఇరాన్ ఈ డిమాండ్‌ను తిరస్కరించి ఉంటే ఇకపై చర్చలు జరిగి ఉండేవి కావని పేర్కొన్నారు. ..ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి శాశ్వత ఒప్పందం కుదరడానికి 60 రోజుల సమయం ఉంది. ఈ గడువును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ఈ 60 రోజులు ఇరాన్‌కు ఒక పరీక్షా సమయం లాంటిదని అన్నారు. ఇరాన్ గనుక అణు కార్యక్రమాలను ఆపకుండా, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తూ తన పాత బుద్ధిని చూపిస్తే ఈ ఒప్పందాన్ని అక్కడికక్కడే రద్దు చేస్తానని హెచ్చరించారు. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. వచ్చే రెండు నెలల్లో ఇరాన్ మంచిగా ప్రవర్తిస్తే వారికి ఆర్థికంగా ఆంక్షల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ నాకు ఈ ఒప్పందంలో ఏదైనా నచ్చకపోతే, వెంటనే దీన్ని రద్దు చేసి మళ్లీ దాడులు మొదలుపెడతామని.. ఇరాన్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ట్రంప్ తెలిపారు..