హర్మూజ్‌ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి…

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి.

ఓ భారతీయుడు గల్లంతు, 10 మంది భారతీయులు సురక్షితం.

ఇరాన్‌ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్.

ఒమన్‌తో కలిసి భారత్‌ గాలింపు చర్యలు
నౌక ఇంజిన్ రూమ్‌కు తీవ్ర నష్టం
..

ప‌శ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్‌ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది..ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “ఒమన్ తీరంలో జీఎఫ్ఎస్‌ గెలాక్సీ వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. నౌకలోని 11 మంది భారతీయులలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు” అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది.

ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం జరుగుతున్న చర్చలను ముగించి, దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోరాదని, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది.

మరోవైపు నౌక అనధికార మార్గంలో ప్రయాణించడం వల్లే దారి మళ్లించే చర్యగా దాడి చేశామని ఇరాన్ తన చర్యను సమర్థించుకుంది. ఈ ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా ఇరాన్‌పై కొత్తగా మూడుసార్లు దాడులు ప్రారంభించింది. నౌకపై దాడి తర్వాత ఒక సిబ్బంది గల్లంతైనట్లు, నౌక ప్రయాణాన్ని కొనసాగించలేని విధంగా దెబ్బతిన్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.

“ఇప్పటికే పలు దాడులకు పాల్పడిన ఇరాన్‌కు మరో అవకాశం ఇచ్చినా నిబంధనలను ఉల్లంఘించింది. అందుకే, పౌర నావికులపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేలా భారీ మూల్యం చెల్లించేలా చేస్తున్నాం” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు సమావేశమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం, ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరగడం మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది..