ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ సెప్టెంబరులో అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తానని స్పష్టం చేశారు..న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తన అరెస్టుకు పిలుపునిచ్చినా తాను వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. ఒక న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ”యూదు ప్రజల సత్యం కోసం నేను న్యూయార్క్‌కు వస్తాను. ఐక్యరాజ్యసమితి వేదికపై ఇజ్రాయెల్ తరఫున, ఇజ్రాయెల్-అమెరికా మైత్రి కోసం నిజాన్ని ప్రపంచానికి చెబుతాను.” అని అన్నారు.
మమ్దానీపై నెతన్యాహు విమర్శలు
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నగర ప్రజలందరికీ సమానంగా వ్యవహరించకుండా సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు. ”మేయర్‌గా ఆయన యూదులు, క్రైస్తవులు, ముస్లింలు సహా అందరి తరఫున పనిచేయాలి. కానీ ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.” అని విమర్శించారు. అలాగే మమ్దానీ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని సమర్థించిన వారిపట్ల ఆయన సానుభూతి చూపారని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందన్న ఆరోపణలను నెతన్యాహు తిరస్కరించారు. ”మారణహోమం చేసినవారు మేము కాదు. హమాస్ అనే ఉగ్రవాద సంస్థను ఎదుర్కొంటున్నాం. అసలు నేరస్థులు వారే.” అని అన్నారు. అలాగే మమ్దానీ వ్యాఖ్యలు న్యూయార్క్‌లోని యూదు సమాజంలో భయాందోళనలు పెంచుతున్నాయని ఆరోపించారు.