బంగాళాఖాతంలో అల్పపీడనం..

తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని హైదరాబాద్ సహా రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉండే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే క్రమంలో అల్పపీడనం ఉత్తర ఒడిశా పరిసరాల్లో నిలకడగా ఉంటే ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన డాల్ఫిన్ టైఫూన్ దక్షిణ చైనా సముద్రం వైపు వచ్చిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుకుగా మారతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు చురుకుగా మారడంతోనే కొస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరా ప్రకారం.. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగళాఖాతంలో అల్పపీడనం తీవ్రమవుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో రుతుపవనాలు యాక్టివ్‌గా మారి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది.

అల్పపీడన ప్రభావం, రుతుపవనాలు యాక్టివ్ కావడంతో నల్లమల ప్రాంతంలో వర్షాలు కురిశాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల, మార్కాపురం జిల్లా పరిధిలో వర్షాలు నమోదయ్యాయి. అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఈ వర్షాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏపీలో ఆశించినంత మేర వర్షాలు లేకపోవడంతోనే రుతుపవనాలు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందన్న వార్త రైతులకు కొంత పోరాటానిచ్చేలా అనిపిస్తుంది..